ఎలుకలపై విజయవంతంగా కరోనా వ్యాక్సిన్ ప్రయోగం
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన పిట్స్బర్గ్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఒక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. వేలిముద్ర పరిమాణంలో ఉండే ఈ టీకాను ఎలుకలపై ప్రయోగించారు. ఎలుకలపై ఉపయోగించినప్పుడు వాటిలో రోగ నిరోధక వ్యవస్థ కరోనా వైరస్‌ను నాశనం చేసే నిర్దిష్ట యాంటిబాడీలను ఉత్పత్తి చేయగా, రెండు వారాల్లోనే వీటి సంఖ్య భారీగా పెరిగినట్టు గుర్తించారు. కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్ అనే నిర్దిష్ట భాగం ఆధారంగా దీన్ని తయారు చేసినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ టీకాను సాధారణ ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయవచ్చని, శీతలీకరించాల్సిన అవసరం లేదని వివరించారు. రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై పరీక్షించనున్నారు.













