జాహ్నవి కేసుల్లో తగిన ఆధారాల్లేవ్ : అమెరికా
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల (23) మరణానికి కారణమైన సియాటెల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్ నేర అభియోగాలను ఎదుర్కోబోరని అధికారులు వెల్లడించారు. తగిన ఆధారాలు లేకపోవడమే కారణంగా పేర్కొన్నారు. జాహ్నవి మరణం హృదయ విదారకంగా ఉంది. కింగ్ కౌంటీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఆ ఘటన ప్రభావితం చేసింది అని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ లీసా మానియన్ పేర్కొన్నారు. అయితే ఈ కేసులో సహేతుకమైన సందేహానికి మించి క్రిమినల్ కేసుగా నిరూపించదగిన ఆధారాలు లేవన్నారు. గతేడాది జనవరి 23న సియాటెల్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవిని కెవిన్ డేవ్ నడుపుతున్న పోలీసు గస్తీ వాహనం గంటలకు 119 కిలోమీటర్ల వేగంతో డీకొంది. దీంతో జాహ్నవి 100 అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే మరణించారు.







