సౌదీ అరేబియా కీలక నిర్ణయం
సౌదీ అరేబియా ప్రభుత్వం స్థానికతకు సంబంధించిన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. హాస్పిటాలిటీ రంగంలో ఉద్యోగాలను తమ దేశ పౌరులకే కల్పించుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. హాస్పిటాలిటీ రంగంలో విదేశీయులను తొలగించి ఈ ఏడాది చివరి వరకు స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన కార్మిక శాఖ రిసార్ట్స్, త్రి స్టార్ రేటింగ్‌కు మించిన హోటళ్లు, ఫోర్ స్టార్ రేటింగ్ మించిన హోటల్ అపార్ట్మెంట్లలో కేవలం సౌదీలను మాత్రమే నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
కిందిస్థాయి నుంచి మేనేజ్మెంట్ వరకు అన్నింట్లో స్థానికులకు ఉపాధి కల్పించనున్నారు. డ్రైవర్లు, డోర్ కీపర్ల్, పోర్టర్లు వంటి ఉద్యోగాల్లో మాత్రం విదేశీయులను కొనసాగేందుకు అవకాశం కల్పించనున్నట్టు అధికారులు వెల్లడించారు. విదేశీయులకు రెస్టారెంట్ హోస్ట్, హెల్త్ క్లబ్ సూపర్ వైజర్ ఉద్యోగాల్లో కోత విధించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. నిరుద్యోగ సమస్య నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.













