అమెరికా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ సింగ్ చర్చలు
అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్సర్తో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చలు జరిపారు. చైనా సరిహద్దు వివాదంపై ఎస్సర్తో రాజ్‌నాథ్ ఫోన్లో మాట్లాడారు. తూర్పు లద్దాఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి నెలకొన్న పరిస్థితులపై ఆయనతో చర్చించారు. గాల్వన్ లోయలో ఘర్షణలు తర్వాత సరిహద్దుల్లో వాతావరణం వేడెక్కింది. చైనా దుశ్చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ ఎల్ఏసి వెంబడి భారీగా బలగాలను మోహరించింది. యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంక్‌లను పెద్ద సంఖ్యలో సిద్ధంగా ఉంచింది. ఇప్పటికే భారత్‌కు అమెరికా బాసటగా నిలిచింది. చైనా దళాలను ఎదుర్కొనేందుకు అవసరమైతే మిత్రదేశాలైన భారత్, జపాన్ తదితర దేశాలకు రక్షణగా తమ అంతర్జాతీయ బలగాలను రంగంలోకి దింపుతామని అగ్రరాజ్యం ప్రకటించింది. ఇప్పటికే జపాన్, అమెరికా, భారత దేశాలకు చెందిన యుద్ధ నౌకలను రంగంలోకి దించారు. మూడు దేశాల దళాలు సంయుక్త యుద్ధ విన్యాసాలు కూడా చేపట్టాయి. ఈ క్రమంలో అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్‌తో రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది.













