ఆ ఔషధం ఖరీదు రూ. 5 కోట్లు!
లక్స్టర్నా కోల్పోయిన కంటిచూపును తిరిగి తీసుకొచ్చే దివ్యౌషధం. వంశపారంపర్యంగా కొందరికి సంక్రమించే రెటీనా క్షీణత వ్యాధికి ఈ ఔషధం చెక్ పెట్టనున్నది. అయితే దీని ధరపైనే ఇప్పుడు అమెరికాలో పెద్ద చర్చ జరుగుతున్నది. దీనిని 8.5 లక్షల డాలర్ల (సుమారు రూ.5 కోట్లు)కు అమ్ముతున్నది లక్స్టర్నా తయారీదారు ఫిలడెల్ఫియాకు చెందిన స్పార్క్ థెరాప్యూటిక్స్. ఒక్క డోసు చాలని, కంటిచూపు తిరిగి వస్తుందని స్పార్క్ సృష్టం చేసింది. ఒక కంటికి అయితే రూ.2.5 కోట్ల లెక్కన వసూలు చేస్తున్నది. నిజానికి దీని ధర మిలియన్ డాలర్లు (రూ.6.4 కోట్లు) ఉంటుందని అంచనా వేసినా, దాని కంటే కాస్త తక్కువకే కంపెనీ విక్రయిస్తున్నది. అమెరికాలో ఔషధాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్న చర్చ జరుగుతున్న సమయంలో ఈ మందు బయటకు రావడం విశేషం. ఈ విమర్శలపై స్పార్క్ సంస్థ స్పందించింది. ఒక వేళ తమ ఔషదంతో వ్యాధి నయం కాకపోతే, మొత్తం డబ్బు వాపస్ ఇస్తామని ప్రకటించింది.













