ముంబై-న్యూయార్క్ డైరెక్ట్ విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నుంచి న్యూయార్క్ విమాన సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మార్గంలో తగినంత డిమాండ్ లేకపోవడంతో ఎయిరిండియా నష్టాల పాలైంది. దీంతో ఈ మార్గంలో తన విమాన సేవలను నిలిపిస్తోంది. డిసెంబర్ 2018లో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయం నుంచి ముంబై-న్యూయార్క్ డైరెక్ట్ విమాన సేవలను ప్రారంభించిన సంస్థ డిమాండ్ తక్కువగా ఉండటంతో ఇకపై ఈ సర్వీసులను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది.
ముంబై-న్యూయార్క్ మధ్య వారానికి మూడుసార్లు విమాన సర్వీసులను నడిపిస్తున్న ఎయిరిండియా పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ మూసివేత కారణంగా ఫిబ్రవరిలో తాత్కాలికంగా సర్వీసులను నిలిపివేసింది. అయితే జూన్‌లో పున:ప్రారంభించాలని భావించినా, ఇకపై ఈ సర్వీసులను కొనసాగించలేమని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే వింటర్‌కు సంబంధించిన అక్టోబర్ మూడవవారం నుంచి మార్చి రెండో వారం వరకు అందించే ఎయిరిండియా విమాన సేవలు ఇందులో భాగం కాదని వివరించారు.













