ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనకు కృషి
ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనకు కృషి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోదీ అంగీకరించారు. సోమవారం రాత్రి ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. అమెరికాలోని టెక్సాస్ నుంచి భారత్‌కు మొట్టమొదటి క్రూడాయిల్ సరఫరా నౌక ఈ నెలలోనే బయలుదేరుతున్నదని ట్రంప్ తెలిపారు. భారత్‌కు శక్తి వనరులను అందించే అవకాశం తమకు సుదీర్ఘకాలం లభించాలని ఆయన ఆకాంక్షించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల స్థాపనకు రెండు దేశాల మంత్రివర్గాల మధ్య వ్యూహాత్మక చర్చలు జరగాలని ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారు. నవంబర్‌లో భారత్‌లో నిర్వహించనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు యూఎస్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాల్సిందిగా తన కూతురు, సలహాదారు ఇవాంకాను కోరాని, ట్రంప్ చెప్పగా, ఇందుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బలమైన నాయకత్వంలో ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని ట్రంప్‌ను ప్రధాని మోదీ కొనియాడారు.













