నరేంద్ర మోదీకి గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ గోల్‌కీపర్’ అవార్డుకు ఎంపికయ్యారు. పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి గుర్తింపుగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆయన సతీమణి మెలిండాల పేరుతో ఏర్పాటైన ట్రస్ట్ బెల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ అవార్డును ఆయనకు అందజేయనుంది. ఈనెల 24న బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ వేదికగా జరగనున్న ఓ కార్యక్రమంలో మోదీ ఈ అవార్డు అందుకోనున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు ప్రధాని త్వరలో అమెరికా వెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పరిష్కరించే ప్రయత్నాలు చేపట్టిన రాజకీయ నేతలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవం నాటికి దేశానికి బహిరంగ మలవిసర్జన రహితం చేయాలన్న లక్ష్యంతో మొదలైన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే తొమ్మిది కోట్ల మరుగుదొడ్లను నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం దేశంలో 98 శాతం గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితయ్యాయి. నాలుగేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 38 శాతం మాత్రమే.













