అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు చేరుకున్నారు. న్యూయార్క్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరికాలో తొలి అధికారిక పర్యటనకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. కలిసికట్టుగా పయనిస్తూ ఉమ్మడి ప్రపంచ సవాళ్లను మరింత సమర్థవంతంగా తట్టుకునేందుకు, ఈ దిశలో విజయం సాధించేందుకు అమెరికా పర్యటన తలపెట్టుకున్నానని ప్రధాని తెలిపారు. పలు సవాళ్లు ఉన్నాయి. అయితే సమిష్టిగా దేనికైనా ఎదుర్కోవచ్చుననే విషయాన్ని రుజువు చేసేందుకు ఈ పర్యటన సాగుతోందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్, ప్రధమ మహిళ జిల్ బైడెన్ దంపతుల ప్రత్యేక ఆహ్వానంపై మోదీ అమెరికా పర్యటన ఖరారు అయింది. ఐరాస ప్రధాన కార్యాలయం వేదికగా సాగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాన అతిధిగా మోదీ పాల్గొంటారు.
తరువాత వాషింగ్టన్ డిసీలో భారతీయ సంతతి వారిని ఉద్దేశించి ప్రసంగించడం, అమెరికా చట్టసభలైన కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో సభ్యులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. ప్రెసిడెంట్ బైడెన్, ఇతర నాయకులతో తాను జరిపే విస్తృత చర్చలకు చాలా ప్రాధాన్యత ఉంది. వివిధ కీలక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు అవకాశం ఏర్పడుతుంది. బైడెన్ దంపతుల సాదర విందు స్వాగతం ఆహ్వానం తనకు సంతోషకరం అని, దీనికి హాజరవుతున్నానని తెలిపారు. వైట్‌హౌస్‌లో బైడెన్ దంపతులు మోదీ గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు.













