నిన్న అమెరికాలో…నేడు నాగ్‌పూర్‌లో రేపు మరిన్ని పట్టణాల్లో.. ‘పాఠశాల’ విద్యాకేంద్రాల ఏర్పాటు
అమెరికాలోని మన చిన్నారులకు తెలుగు భాషను నేర్పించేందుకోసం 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పాఠశాల నేడు ఇండియాలోని పలు నగరాల్లో, పట్టణాల్లో కూడా తన విద్యాకేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో దాదాపు 20 కేంద్రాల ద్వారా 400 మంది చిన్నారులకు తెలుగు భాషను ‘పాఠశాల‘ నేర్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించిన ‘తెలుగు పలుకు’ కోర్స్‌ను పాఠశాల బోధిస్తున్న సంగతి తెలిసిందే. నేటితరానికి అనుగుణంగా, సులభంగా, శాస్త్రీయంగా ఉండేలా ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యు (LSRW) పద్ధతిలో అంటే వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం ద్వారా తెలుగు భాషను నేర్పిస్తోందని పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు నివసిస్తున్న చోట్ల పాఠశాల విద్యాకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సుబ్బారావు వివరించారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆంధ్రఅసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాలను జనవరి 7వ తేదీన ప్రారంభించడం జరిగిందని చెప్పారు. త్వరలోనే కొచ్చి, ముంబైలలో కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
నాగ్‌పూర్‌లో జరిగిన పాఠశాల కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ డా. కె. వెంకటేశం ముఖ్య అతిధిగా హాజరై మాతృభాష పరిరక్షణకు ఆంధ్ర అసోసియేషన్, పాఠశాల చేస్తున్న కృషిని ప్రశంసించారు. మనం ఎక్కడ ఉన్నా మన మాతృభాష తెలుగును విస్మరించరాదని, దానిని పరిరక్షించుకోవడం మన బాధ్యత అని ఆయన చెప్పారు.
ఆంధ్ర అసోసియేషన్ నాగ్‌పూర్‌లో ఉన్న తెలుగు కుటుంబాల సౌకర్యార్థం ఈ పాఠశాల కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, దీనికి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉందని ఆంధ్ర అసోసియేషన్ కార్యదర్శి పిఎస్ఎన్ మూర్తి చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 28 రిజిస్ట్రేషన్స్ వచ్చాయని, ఇద్దరు టీచర్లను నియమించామని, అందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు తరగతులను నిర్వహిస్తున్నామని పాఠశాల సెంటర్ కో ఆర్డినేటర్ పిటి శర్మ తెలిపారు. పాఠశాలలో చేరాలనుకునేవారు జనవరి నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇందుకు సంబంధించి ఇతర వివరాల కోసం తనను 9421801151లో సంప్రదించవచ్చని చెప్పారు.
అమెరికాలో పాఠశాల ఇంక్ పేరుతో రిజిష్టర్ అయి, 501 సి(3) గుర్తింపును పొందిన ఈ సంస్థకు మేనెజింగ్ పార్టనర్‌గా టీవీ5 వ్యవహరిస్తోంది.













