ఎన్ఆర్ఐలకు ఉపశమనం.. మరో 6 నెలలకు సరిపడా బియ్యం నిల్వలు
భారత్ నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించడంతో ఆందోళనలో ఉన్న అమెరికాలోని ఎన్ఆర్ఐలకు ఉపశమనం లభించనుంది. అమెరికాలోని ఎక్స్పోర్టర్స్ చెబుతున్న వివరాల ప్రకారం అమెరికా రైస్ ట్రైడర్స్ దగ్గర ప్రస్తుతం 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలున్నాయి. దానికి తోడు భారత్ నుంచి ఇప్పటికే చేసుకున్న ఒప్పందాల ప్రకారం మరో 18 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అమెరికాకు చేరుకోవాల్సి ఉంది. ఈ నిల్వల ద్వారా వల్ల 6 నెలల వరకు అమెరికాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని రైస్ ఎక్స్పోర్టర్స్ భరోసా ఇస్తున్నారు. అంతే కాకుండా ఈ పరిస్థితికి సంబంధించి భారత ప్రభుత్వం త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటుందని రైస్ ఎక్స్పోర్టర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా రైస్ ట్రేడర్స్ చెబుతున్న వివరాల ప్రకారం.. భారత్ నుంచి అమెరికాకు ప్రతి నెలా 6 వేల మెట్రిక్ టన్నుల సాధారణ బియ్యం ఎగుమతి అవుతుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణల నుంచే 4 వేల మెట్రిక్ టన్నుల వరకు ఎగుమతి అవుతుంది. అయితే తాజాగా ఈ ఎగుమతులపై భారత ప్రభుత్వం విధించిన నిషేధంతో ఈ ఎగుమతులన్ని నిలిచిపోబోతున్నాయి. దీని కారణంగా అమెరికాలోని ఎన్ఆర్ఐల్లో ఆందోళన మొదలైంది. ఫలితంగా బియ్యం కొరత రాకముందే అవసరమైనంత బియ్యం కొనుక్కునేందుకు ప్రజలు షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్ల వద్ద బారులు తీరారు. ఇదే అదనుగా ఆయా దుకాణాల యజమానులు కూడా బియ్యం ధరలను రెండింతల వరకు పెంచేశారు. కొన్ని చోట్ల ఏకంగా కిలో బియ్యం ధర 40 డాలర్లు అంటే భారత కరెన్సిలో 3,280 రూపాయల వరకు పెంచేశారు.













