దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో కిమ్ జోంగ్ చర్చలు
ఉత్తర కొరియాలోని యాంగ్బ్యాన్లో ఉన్న ప్రధాన అణు కేంద్రాన్ని శాశ్వతంగా నేలమట్టం చేస్తామని ఆ దేశ అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు. అదే సమయంలో ఒక షరతు కూడా పెట్టారు. అమెరికా కూడా ఆ దేశంలో ఇలాంటి చర్యే తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో జరిగిన చర్చల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇతర దేశాల పర్యవేక్షకుల సమక్షంలో టోంగ్‌చాంగ్-రిలో ఉన్న క్షిపణి ఇంజిన్ల పరీక్ష కేంద్రాన్ని, క్షిపణుల ప్రయోగ కేంద్రాన్ని కూడా కూల్చివేయడానికి కూడా అంగీకరించారు. 2032లో ఉభయ కొరియా దేశాలు సంయుక్తంగా ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి సమ్మతి తెలిపారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాలను నిలిపివేసేలా చూడాలని గట్టిపట్టుదలతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత ఉభయ కొరియా దేశాల మధ్య చర్చలు జరిగేలా ఒత్తిడి తెచ్చారు. ఆ మేరకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ప్యాంగ్యాంగ్ వచ్చారు. చర్చల అనంతరం ఇరు దేశాల నేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో అణు కేంద్రాల మూసివేతను ప్రస్తావించారు.













