NATS: నాట్స్ కాన్ఫరెన్స్‌లో నాదెండ్ల మనోహర్.. పవన్ పేరు చెప్పగానే ప్రేక్షకుల్లో హుషారు
నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాలకు ముఖ్యఅతిథిగా జనసేన ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నారైలు కూడా మార్పు కోరుకున్నారని, కూటమి ప్రభుత్వాన్ని బలపరిచారని కొనియాడారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒక విజన్‌తో ముందుకెళ్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే ప్రేక్షకులంతా ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్‌లో కూడా ఎన్నారైలు పాలుపంచుకోవాలని కోరారు. స్వర్ణాంధ్ర విజన్ 2027లో భాగంగా పబ్లిక్, ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్‌షిప్ (పీ4) అనే ప్రోగ్రామ్‌ను ఏపీ ప్రభుత్వం తెచ్చిందని, దీనిలో ప్రజలంతా పాలుపంచుకోవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందన్నారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మధు కూరపాటి, ప్రశాంత్, శ్రీనివాస్ గుత్తికొండ సహా నాట్స్ టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, డాక్టర్ కామినేని శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.







