మిస్సోరిలో దుర్ఘటన
అమెరికా మిస్సోరిలోని ఓ సరస్సులో పర్యాటక పడవ మునిగి ఓ చిన్నారితో సహా 17 మంది మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. గాయపడ్డ ముగ్గురు చిన్నారులు, నలుగురు పురుషులను దవాఖానకు తరలించామని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని బ్రాన్సన్లోని దవాఖాన అధికార ప్రతినిధి బ్రాండీ క్లిఫ్టన్ తెలిపారు. బ్రాన్సన్లోని టేబుల్ రాక్ సరస్సులో గురువారం రాత్రి 30 మంది పర్యాటకులతో వెళ్తున్న పడవ మునిగి ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని స్టోన్ కౌంటీ అధికారి డౌగ్ రేడర్ తెలిపారు. గల్లంతయిన వారి కోసం గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతికూల వాతావరణం కారణంగానే పడవ మునిగి ఉంటుందని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సరస్సులో ఉన్న మరో పడవ సురక్షితంగా తిరిగి ఒడ్డుకు చేరుకుంది. బ్రాన్సర్లో గురువారం సాయంత్రానికి భారీ తుఫాను హెచ్చరికను జారీచేశామని అధికారులు తెలిపారు.













