BRS: 25 ఏళ్ల తెలంగాణ గర్వం – ప్రపంచవ్యాప్త ఉత్సవం! ఎన్నారైలతో మహేష్ బిగల జూమ్ లో మీటింగ్
బీఆర్ఎస్ ఎన్నారై (BRS NRI) శాఖ తరఫున తెలంగాణ రజతోత్సవ మహాసభకు మద్దతు.
ప్రవాస తెలంగాణ వాసులందరికీ గర్వకారణమైన ఈ సందర్భంలో, తెలంగాణ రాష్ట్ర రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ ఎన్నారై శాఖ తరఫున హృదయపూర్వక మద్దతును ప్రకటిస్తున్నాము.
ఈ సందర్భంగా ఎన్నారైల జూమ్ కాల్ మీటింగ్లో 50 దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు, బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై శాఖ కోఆర్డినేటర్ మహేష్ బిగాల (Mahesh Bigala) మాట్లాడుతూ:
“తెలంగాణ ఉద్యమ సారధి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ఈ మహాసభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నందుకు ప్రవాస భారతీయులుగా మేము గర్వపడుతున్నాము. ఉద్యమ సమయంలో విశ్వరూప మహాసభ వంటి చారిత్రక సభలకు వేదికైన వరంగల్ గడ్డపై ఈ రజతోత్సవ మహాసభ స్ఫూర్తిదాయకంగా మారుతుందని మాకు విశ్వాసం.
మహాకవి కాళోజీ, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావుల ఉద్యమ స్ఫూర్తి, కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ సాధనకు బలమైన పునాది వేసాయి. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన విషయం జగమెరిగిన సత్యం.
రజతోత్సవ మహాసభ విజయవంతమవాలని, కేసీఆర్ గారి ఆశయాలు ప్రపంచానికి చాటి చెప్పబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఉత్సవానికి మా సంపూర్ణ మద్దతును తెలుపుతున్నాము.”
బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు అని చెప్పారు, అలాగే సంవత్సర కాలం పాటు వివిధ దేశాలలో రజతోత్సవ వేడుకలు చేయనున్నారని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అమెరికాలో, ఆస్ట్రేలియా లో , యూకే లో సౌత్ ఆఫ్రికా లో అలాగే గల్ఫ్ మరియు వివిధ దేశాలలో ఈ వేడుకలకు బీఆరెస్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు అని అన్నారు , రాబోయే రోజుల్లో అన్ని వివరాలను ప్రకటిస్తారని తెలిపారు.








