ఇండియాలోనే ఎఫ్-16ల తయారీ : అమెరికా
అమెరికన్ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ లాక్హీడ్ మార్టిన్ అత్యంత అరుదైన నిర్ణయం తీసుకుంది. ఎఫ్-16 యుద్ధ విమానాలను భారతదేశంలో తయారు చేయాలని నిర్ణయించింది. లాక్హీడ్ మార్టిన్ ఏరోనాటిక్స్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ లాల్ ఈ వివరాలు ఓ మీడియా సంస్థకు తెలిపారు. అంతర్జాతీయ యుద్ధ విమానాల తయారీ రంగానికి రెండు పదాలను పరిచయం చేయబోతున్నామని వివేక్ చెప్పారు. భారతదేశం, కేవలం అనేవి ఆ రెండు పదాలు అని తెలిపారు. భారతదేశం కోసం ప్రత్యేకంగా అత్యాధునిక యుద్ధ విమానాలను భారతదేశంలోనే తయారు చేయబోతున్నట్లు తెలిపారు. గతంలో కానీ, వర్తమానంలో కానీ ఇతర విమానాల తయారీ సంస్థలేవీ ఇటువంటి ప్రయత్నం చేయలేదన్నారు. ఇండియన్ మేడ్ యుద్ధ విమానాలకు ఎగుమతి అవకాశాలు కూడా ఉంటాయన్నారు. దీనివల్ల భారతదేశ పారిశ్రామిక రంగానికి కూడా మేలు జరుగుతుందని తెలిపారు. భారతదేశానికి ఇవ్వబోతున్న యుద్ధ విమానం అత్యంత ఆధునికమైనది తెలిపారు. ఎఫ్-16లో మూడు వేరియెంట్లను అందిస్తున్నట్లు చెప్పారు. ఇవన్నీ సింగిల్ ఇంజిన్ విమానాలని తెలిపారు.













