అమెరికా అధ్యక్ష రేసులో కెన్యే వెస్ట్
మరో నాలుగు నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సిన తరుణంలో అనూహ్యంగా రిపబ్లికన్ల తరపున ప్రముఖ ర్యాపర్, కిమ్ కర్దాషియన్ భర్త కెన్యే వెస్ట్ రంగంలోకి దిగారు. అధ్యక్షుడు ట్రంప్‌కు గతంలో మద్దతు పలికిన కెన్యే, ఇప్పుడు ఆయన్నే చాలెంజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో టెస్లా అధినేత ఎలాన్ ముస్క్ ఆయనకు మద్దతు పలకడంతో, దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశమైంది. తాను మాజీ ఉపాధ్యక్షుడు, ప్రస్తుతం డెమోక్రాట్ల తరపున పోటీ చేస్తున్న జో బిడెన్ తో పోటీ పడతానని ఆయన ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులకు కావల్సిన కనీస మద్దతుదారుల కోసం పోలింగ్ ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో.. తనకూ అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు.
నేను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నా. దేవుడిపై నమ్మకం ఉంచే అమెరికన్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉంది. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి అని తన సోషల్ మీడియా ఖాతాలో కెన్వే వెస్ట్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ విషయంలో కెన్యే ఎంత సీరియస్‌గా ఉన్నారన్న చర్చ ఇప్పుడు మొదలైంది. నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. గతంలో తన భార్య కిమ్ తో కలిసి కెన్యే వెస్ట్ వైట్ హౌస్‌ను కూడా సందర్శించారు.













