పేద బ్రాహ్మణులకు సహాయపడిన జయరాం కోమటి
కరోనా, లాక్ డౌన్ వల్ల ఆలయాలు మూతపడంతోపాటు, ఇతర పనులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులను తానా మాజీ అధ్యక్షుడు, ఎన్నారై ప్రముఖుడు జయరాం కోమటి ఆదుకున్నారు. వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను అందించారు. పేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవడంకోసం వ్యాసపీఠం గ్రూపు సభ్యులు జయరాం కోమటితోపాటు ఇతరుల దగ్గర నుంచి విరాళాలు సేకరించి 70 బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం, దక్షిణ అందించారు. గోకుల్ రాచిరాజు వంటి ఎన్నారైలు ఈ కార్యక్రమానికి సాయపడ్డారు.
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద బ్రాహ్మణులకు వ్యాసపీఠం, కోమటి జయరాం తరఫున నిత్యావసరాలు అందజేశారు. గోకుల్ రాచిరాజు సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్లోని మల్కాజ్ గిరి, ఆర్కే నగర్, శివాలయం ప్రాంతాలలో నివసించే 70 బ్రాహ్మణుల కుటుంబాలకు 25 కేజీల బియ్యం, 15 రకాల నిత్యావసర సరుకులు, గొడుగులు పంపిణీ చేశారు.
పసుపు, కుంకుమ, విభూతి ప్యాకెట్ తోపాటు 101-00 దక్షిణ కూడా అందించారు. వివిధ దేశాల్లో నివసిస్తోన్న ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసుకున్న వ్యాసపీఠం సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మూడేళ్ల క్రితం వాట్సాప్ గ్రూపుగా ఏర్పడిన వ్యాసపీఠం అనతి కాలంలోనే ధార్మిక సంస్థగా మారి పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఎన్నారై వ్యాసపీఠం వాట్సాప్ గ్రూపు సభ్యులు, పలువురు విరాళాలందించారు.













