వైట్‌హౌస్‌ను వీడనున్న ఇవాంకా ట్రంప్ ?
2020లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే, తాను వైట్ హౌస్‌లో ఉండబోనని ఇవాంక ట్రంప్ సూచన ప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం ఇవాంక తన తండ్రికి సలహాదారుగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా, సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యులో మరోదఫా తండ్రికి సలహాదారుగా కొనసాగుతారా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం ఇచ్చిన ఆమె.. ఇకపై తన పిల్లలు, వారి సంతోషంలో భాగం కావాలని ఉందని, వారికే తన తొలి ప్రాధాన్యతని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే తన నిర్ణయం ఉంటుందని, పిల్లల బాగోగులు చూసుకోవడంలోనే తనకు ఆనందమని అన్నారు. మీ ప్రశ్నకు సమాధానం తన పిల్లల నుంచే వస్తుందని తెలిపారు. తన విధుల ప్రభావం వారి జీవితాలపై ఉండకుండా చూడాలని భావిస్తున్నట్టు తెలిపారు.
గత రెండున్నరేళ్లుగా తాను ప్రయాణిస్తూనే అత్యధిక సమయం గడిపానని, దేశం కోసం సేవ చేశానని, ఇప్పుడు తన పిల్లల వారి అవకాశాలను వెతుక్కునేందుకు సహకరిస్తానని అన్నారు. ఇదే సమయంలో తండ్రికి సలహాదారుగా తాను చాలా చేశానని.. అయినా ఇంకా తన పని పూర్తి కాలేదనే భావిస్తున్నానని అన్నారు. రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదంటూనే, తన భర్త జారెడ్ కుష్ నర్ తో కలిసి పిల్లలను చూసుకుంటూ ఉండటమే ఇష్టమని 38 ఏళ్లు ఇవాంక వ్యాఖ్యానించారు.













