అమెరికాలో భారతీయుడికి 9 ఏళ్ల జైలుశిక్ష
అమెరికాలో హెల్త్‌కేర్ కుంభకోణానికి పాల్పడిన ఓ భారతీయుడిని అక్కడి న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతడికి 9 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. భారత్‌కు చెందిన యోగిశ్ కె.పంచోలి(43) మిషిగాన్‌లో నివాసముంటున్నాడు. ఈయన ష్రింగ్ హోమ్‌కేర్ అనే కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థ కొనుగోళ్లకు తన వివరాలు కాకుండా ఇతరుల పేర్లు, సంతకాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించారు. రెండు నెలల వ్యవధిలోనే మెడికేర్ నుంచి దాదాపు రూ.23.25 కోట్లు ( 2.8 మిలియన్ డాలర్లు) పొందాడు. ఎలాంటి సేవలు అందించకుండానే ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేశాడు. స్నేహితుల సాయంతో ఈ నిధులను డొల్ల కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. అక్కడి నుంచి భారత్‌లోని పంచోలి ఖాతాలోకి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది.







