శ్వేతసౌధంలో భారతీయ అమెరికన్ నియోమిరావుకు కీలకపదవి
శ్వేతసౌధ సమాచార, నిబంధన వ్యవహారాల కార్యాలయానికి (ఓఐఆర్ఏ) అధిపతిగా భారతీయ అమెరికన్ న్యాయవాది నియోమిరావు నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించడంతోపాటు, విధాన ముసాయిదా నిబంధనలపై సమీక్షలను ఈ కార్యాలయం నిర్వహిస్తుంటుంది. ఓఐఆర్ఏకు అధిపతి పదవికి నియోమిరావు పేరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే ప్రతిపాదించారు. ఈ నియామాకానికి తాజాగా సెనేట్ 54-41 ఓట్లతో ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయంలో నియోమి ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి క్లారెన్స్ థామస్ కార్యాలయంలోనూ గతంలో ఆమె సేవలందించారు. నియోమిరావు నియామకాన్ని అమెరికా చట్ట సభల సభ్యులు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్వవస్థకు అడ్డంకులుగా మారిన అనవసరపు నిబంధనలను తొలగిస్తానని ట్రంప్ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఆమె కీలకపాత్ర పోషిస్తారని సెనేట్ న్యాయ సంఘం సీనియర్ సభ్యుడు మాజీ చైర్మన్ ఒరీన్ హాచ్ అన్నారు.













