అమెరికాలో భారత సంతతి వైద్యుడి కాల్చివేత
అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన వైద్యనిపుణుడొకరు కారులో ప్రయాణిస్తున్న సమయంలో అనుమానాస్పద పరిస్థితుల్లో కాల్పులకు గురై మరణించాడు. నగరంలోని హెన్రీ ఫోర్డ్ ఆస్పత్రిలో యూరాలజీ విభాగంలో పనిచేస్తున్న రాకేష్ కుమార్ (32) మృతదేహం డెట్రాయిట్కు 90 మైళ్ల దూరంలో కారులో కన్పించిందని పోలీసులు తెలిపారు. ఆయన మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదన్న రాజేష్‌కుమార్ కుటుంబ సభ్యులు, ఇది విద్వేష చర్య అయ్యే అవకాశాలు లేవని తేల్చిచెప్పారు. ఈ హత్యకు కారణమేమిటన్న విషయం తమక తెలియదని, దానిని పోలీసులే బయటకు తీయాలని మృతిడి తండ్రి నరేంద్రకుమార్ చెప్పారు. తనకు ఎవరిపైనా అనుమానం లేదని, ఇది విద్వేషహత్య కాదని తాము భావిస్తున్నామని ఆయన అన్నారు. డా.రాకేష్ కుమార్ కొచ్చిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి వైద్య పట్టా పొందారు. గత కొద్దిరోజులుగా తాను తన కుమారుడికి పలు ఫోన్ కాల్స్ చేశానని, సందేశాలు పంపానని, అయితే స్పందన వెలువడలేదని నరేంద్రకుమార్ వివరించారు. తన కుమారుడి అపార్ట్మెంటుకు వెళ్లినపుడు అతడు కన్పించకపోవటంతో తాను పోలీసులను ఆశ్రయించానన్నారు. అయితే దీనిపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు.













