త్వరలో సియాటెల్ లో భారత కాన్సులేట్
అమెరికాలోని సియాటెల్‌లో భారత కాన్సులేట్ త్వరలో ఏర్పాటు కానుంది. ఈ నెలాఖరులోనే అది ఏర్పాటయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సియాటెల్‌లో భారత కాన్సులేట్ ఏర్పాటుకు ఏడేళ్ల క్రితమే ప్రకటన వెలువడిందని, అది ఇంతకాలానికి సాకారంకానుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాషింగ్టన్ సమావేశమైన అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో సియాటెల్‌లో నూతన కాన్సులేట్ ఏర్పాటు ఈ ఏడాది చివర్లో కార్యరూపం దాల్చనున్నట్టు పేర్కొన్నారు. అందులో తొలి కాన్సులేట్ జనరల్‌గా 2002 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి ప్రకాశ్ గుప్తాను నియమించనున్నట్టు తెలిపింది. ప్రకాశ్ గుప్తా ప్రస్తుతం విదేశాంగ శాఖ కార్యాలయంలో ఐరాస రాజకీయ విభాగం సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.













