అమెరికా కు భారత్ షాక్
అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని వస్తువులపై భారత్ సుంకాలు పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెల నుంచి ఈ సుంకాల పెంపును అమలు చేయనున్నట్లు భారత్ వెల్లడించింది. సెప్టెంబర్ 18 నుంచి సుంకాల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. అమెరికా గత కొన్ని రోజులుగా విదేశీ వస్తువులపై సుంకాలు పెంచుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇతర దేశాలు కూడా దీటుగానే స్పందిస్తున్నాయి. సుంకాల పెంపు నుంచి భారత వస్తువులను మినహాయించాలని కోరగా అమెరికా తిరస్కరించడంతో, బదులుగా భారత్ కూడా పన్నులు పెంచింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని భారత్ ఈ ఏడాది జూన్లో నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 4 నుంచి పెంచిన సుంకాలు అమలు చేయాలని భావించింది. కానీ తేదీని సెప్టెంబరు 18కు మార్చింది. అమెరికా నుంచి భారత్కు దిగుమతి చేసుకునే బాదం, వాల్నట్స్, ఆపిల్స్ తదితర ఉత్పత్తులపై సుంకాలు పెరగనున్నాయి.













