భారత్ కన్నా చైనాయే ప్రమాదకరం : నిక్కీ హేలీ
స్వేచ్ఛాయుత ప్రభుత్వం, స్వేచ్ఛలేని ప్రభుత్వం వల్ల ఎదురయ్యే ముప్పు మధ్య తేడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆర్థికంగా పెద్ద ఎత్తున, వేగంగా విస్తరిస్తూన్న ఇండియా, చైనాలే మంచి ఉదారహణ అని భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ తాజా పుస్తకం విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ పేర్కొంది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి రాసిన ఈ పుస్తకం విడుదలైంది. ప్రపంచంలో ఆర్థికంగా, సైనికంగా తన ఉనికిని విస్తరించుకునేందుకు చైనా వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. కానీ అది మంచి పద్ధతి కాదు. మేధో సంపత్తిని చైనా అపహరిస్తోంది. ఉత్తర కొరియా మన ఆంక్షల్ని ఉల్లంఘించేందుకు చైనా తోడ్పడుతోంది. చైనా తన కరెన్సీ మార్పిడికి మన వ్యాపార సంబంధాల్ని విషతుల్యం చేసే విధానాల్ని అనుసరిస్తోంది. అంతేకాదు, చాలావేగంగా తన సైనిక పాటవాన్ని విస్తరిస్తోంది అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేస్తున్నారు. చైనాతో వ్యాపార పరంగా అమెరికా మరింత దూకుడుగా వ్యవహరించడానికి ఇదే తరుణమన్నారు.
భారతదేశం గురించి చెబుతూ ఆమె..ఇండియా అణుశక్తి దేశం. అయినా ఆ దేశంపట్ల ఎవరికీ అనుమానాలు లేవు. ఎందుకంటే అది ప్రజాస్వామిక దేశం. ఎవరినీ బెదిరించదు. అమెరికాకు ఇండియాతో భాగస్వామ్యం ఉంది. అది రోజు రోజుకీ మరింత బలపడుతోంది. ఈ రెండు దేశాలు ఉగ్రవాదం బాధితులే. ఉగ్రవాదుల్ని వారిని ప్రేరేపించే ద్వేషపూరిత ఆలోచనల్ని మట్టి కరిపించేందుకు కలిసి పనిచేస్తాం. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకుండా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్లను నిలువరించేందుకు కట్టుబడి ఉన్నాం. మా భాగస్వామ్యం భాగస్వామ్య సిద్ధాంతాల మీద ఆధారపడింది అని హేలీ తన పుస్తకంలో పేర్కొన్నారు.













