ఎన్నారై పిల్లలకు మాతృభాష అవసరం… ‘పాఠశాల’తోనే అది సాధ్యం : మంత్రి గంటా శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్యంలో ఉన్నవారు తమ సంతతి అమెరికాలో ఉన్నప్పటికీ వారు పూర్తి సంతోషాన్ని పొందలేకపోతున్నారు. దీనికి కారణం ఇక్కడ ఉన్న సంతతికి తెలుగు రాకపోవడమే. దాంతో వారు తమ మనవళ్ళు, మనవరాళ్ళతో స్వేచ్ఛగా తెలుగులో మాట్లాడలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని తొలగించడానికి ‘పాఠశాల’ కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
రెండేళ్ళ క్రితం తాను కాలిఫోర్నియా వచ్చినప్పుడు పాఠశాల టీమ్తోనూ, చిన్నారులతోనూ సమావేశమైనప్పుడు తెలుగు భాషపై వారికి ఉన్న అంకితభావాన్ని గుర్తించినందునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ పాఠశాలను తన భాగస్వామిగా తీసుకుందని చెప్పారు. ఎన్నారై పిల్లల కోసం 4 సంవత్సరాల తెలుగు కోర్సును రూపొందించి పాఠశాల ద్వారా దానిని ఎపి ప్రభుత్వ విద్యాశాఖ బోదిస్తోందని చెప్పారు. ఈ సంవత్సరం దాదాపు 30 మంది పిల్లలు 4 సంవత్సరాల తెలుగు కోర్స్‌ను పూర్తి చేసి సర్టిఫికెట్‌ను అందుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.
బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాల వసంతోత్సవ వేడుకలను జూన్ 3వ తేదీన మిల్పిటాస్లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. వార్షికోత్సవ వేడుకలను వసంతోత్సవం పేరుతో నిర్వహించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్ళలో కూడా వార్షికోత్సవ వేడుకలను వసంతోత్సవం పేరుతో నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించి సాంస్కృతిక కార్యక్రమాలు బావున్నాయని, అందులో ‘భువన విజయం’ వంటి క్లిష్టమైన ప్రదర్శనను కూడా పాఠశాల విద్యార్థులు సులభంగా చేశారని చెప్పారు.
రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మాట్లాడుతూ, ఎన్నారై పిల్లలకు మాతృభాషపై మమతను పెంచడంలో పాఠశాల చేస్తున్న కృషిని అభినందించారు. గుంటూరు జడ్పి మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ, పాఠశాల యాజమాన్యం మాతృభాషను బోధించడమే కాకుండా వారిని మాతృరాష్ట్రానికి కూడా కనెక్ట్ చేస్తోందని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి మాట్లాడుతూ, పాఠశాలను 5 సంవత్సరాల క్రితం ప్రారంభించామని చెప్పారు. నేడు 4 సంవత్సరాల తెలుగుకోర్స్ను పిల్లలు పూర్తి చేయడం సంతోషంగా ఉందని, వారు కోర్స్‌ను పూర్తి చేయడానికి మూల కారణం మాత్రం అంకితభావంతో విధులను నిర్వహిస్తున్న పాఠశాల టీచర్లేనని చెప్పారు.
విద్యాసంవత్సరం పూర్తి చేసుకున్న దాదాపు 200 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను, మెడల్స్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు బహుకరించారు. సన్నివేల్, డబ్లిన్, శాన్‌రామన్, ఫ్రీమాంట్, శాన్‌హోసెలో ఉన్న పాఠశాల కేంద్రాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. బాటా అడ్వయిజర్ శ్రీమతి విజయ ఆసూరి, బాటా మాజీ ఆధ్యక్షులు ప్రసాద్ మంగిన, రమేష్ కొండ, వీరు ఉప్పల, యశ్వంత్ కుదరవల్లి, హరినాథ్ చికోటి, శిరీష బత్తుల, కళ్యాణ్ కట్టమూరి, కరుణ్ వెలిగేటి, కొండల్ రావు, శ్రీదేవి పసుపులేటి, శ్రీలు, అరుణ్ రెడ్డి, హరి సన్నిధి, పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు వెంకట్ ఈదర, వైజాగ్ జడ్పి మాజీ చైర్మన్ లాలం భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













