NRI: సేవలోనే ఆనందం.. ఎన్ఆర్ఐ సామాజిక కార్యకర్త దాము గేదెల
రాజాం: స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో రాజాంకు చెందిన శ్రీ పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు కత్తులకవిటికి చెందిన ఎన్ఆర్ఎ, సామాజిక సేవా కార్యకర్త దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ… తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు సత్కరించారు. అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్రదర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






