కరోనా ఇక్కట్లు…స్టూడెంట్లకు, వృద్ధులకు జిడబ్ల్యుటీసిఎస్ సహాయం
కోవిడ్19 వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. లక్షలాదిమంది ఆస్పత్రులపాలు చేసింది. వేలాదిమంది తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రజలు భయానకమైన పరిస్థితిని నేడు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ కారణంగా చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఎక్కడి ప్రజలు అక్కడ ఊహించని రీతిలో చిక్కుకుపోవడంతో జనజీవితం స్తంభించిపోయింది.
అగ్రరాజ్యం అమెరికాలో కూడా పరిస్థితి భయానకంగానే ఉంది. కరోన వైరస్ విజృంభణతో అమెరికాలోని పలు రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్ళిన భారతీయ విద్యార్ధులు కొందరు లాక్డౌన్ కారణంగా ఆర్థికసమస్యలతోపాటు పలు ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి భారతీయ విద్యార్ధులకు మేమున్నాము అని థైర్యం చెబుతూ, వారికి కావలసిన సహాయసహకారాల అందించడానికి వాషింగ్టన్లోని గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సొసైటి (జిడబ్ల్యుటీసిఎస్) ముందుకు వచ్చింది.
ఏప్రిల్ 19వ తేదీన ఆదివారంనాడు అమెరికాలో ఉంటున్న భారత విద్యార్థులకు, వృద్ధులకు ఉచితంగా కూరగాయలను, నిత్యావసర వస్తువులను ఇండియన్ స్పైస్ ఫుడ్ మార్కెట్ ద్వారా అందించారు. మార్కెట్ కి వచ్చి తీసుకోలేని వారికి ఇంటికి తీసుకు వెళ్ళి మరీ అందించడము జరిగింది. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు సతీశ్ వేమన, జిడబ్ల్యుటీసిఎస్ ప్రెసిడెంట్ సాయిసుధ పాలడుగు విద్యార్థులకు నిత్యావసర సరుకులను అందించారు. సంఘం కార్యవర్గ సభ్యులు చంద్ర మాలవతు, భాను మాగులూరి, కృష్ణ లంక, శ్రీనివాస్గంగ, రవి అడుసుమిల్లి, యశ్ బత్తులూరి, ఎన్ఆర్సి నాయుడు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.













