జిడబ్ల్యుటీసిఎస్ దీపావళి…అలరించిన ‘సీతారామం’ టీమ్
వాషింగ్టన్ డీసీలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జిడబ్ల్యుటీసిఎస్) ఏర్పాటు చేసిన దీపావళి వేడుకలు అందరినీ ఆకట్టుకునేలా సాగాయి. ఈ వేడుకలల్లో సీతారామం బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీతారామం సినిమాల్లో హీరో, హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌తోపాటు స్వప్న దత్, హను రాఘవపూడి మరియు ఇతర సంగీత కళాకారులు ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షురాలు సాయి సుధ పాలడుగుతోపాటు కమిటీ సభ్యులు పలువురు ఈ వేడుకల విజయవంతానికి తగిన ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 29వ తేదీన జాన్ కాంపె హైస్కూల్లో మధ్యాహ్నం 2 నుంచి 10.30 వరకు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తొలుత సీతారామం హీరో,హీరోయిన్లు ఇతరులకు ఘనంగా స్వాగతం పలికారు. వేడుకల్లో జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు తొలుత అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీడబ్ల్యూటీసీఎస్ తరపున భాష, కళానైపుణ్యాలాను తెలియజెప్పేలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించామని, ఈసారి దీపావళి వేడుకలను బ్లాక్‌బస్టర్ సినిమాతో ఆకట్టుకున్న ‘సీతారామం’ సినిమా టీమ్‌తో కలిసి వైభవంగా చేస్తున్నామని చెప్పారు. అమెరికా తెలుగు సంఘాల్లో జీడబ్ల్యూటీసీఎస్ కు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికాలో ఉన్న అన్ని సంస్థల కంటే ఈ సంస్థకి సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. తెలుగు భాషను, సంస్కృతీ సంప్రదాయాలను ఘనంగా చాటుతూ, గత 47 సంవత్సరాలుగా ప్రతి తరానికి దగ్గర చేస్తూ ముందుకు సాగుతుందన్నారు.
హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ జీడబ్ల్యూటీసీఎస్ దీపావళి వేడుకల ద్వారా ఎంతోమంది తెలుగువారిని ఒకేచోట కలుసుకోవటం సంతోషంగా ఉందన్నారు. నా సినిమాలను అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలు బాగా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాలం మారుతున్నా, నాగరికత మారుతున్నా, సంస్కృతి మారుతున్నా అమెరికాలో ఉన్న తెలుగువారు మాత్రం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను, పండుగలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
సినీ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ మాట్లాడుతూ.. సీతారామం చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక మహిళగా సాయిసుధా ఈ సంస్థను సమర్థంగా నడిపించిందని కొనియాడారు. నిర్మాత స్వప్న దత్ మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమ అనేకమంది నటులకు అవకాశాలు కల్పించింది అన్నారు.
ఈ కార్యక్రమంలో సతీష్ వేమన, నరేన్ కొడాలి, కృష్ణ లాం, మన్నవ సుబ్బారావు, సత్య సూరపనేని, వెంకట్రావు మూల్పూరి, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు చంద్ర మాలవత్తు, రవి అడుసుమిల్లి, విజయ్ అట్లూరి, సుష్మా అమరుత్తలూరి, రాజేష్ కాసరనేని, భాను మాగులూరి, ఉమాకాంత్ రఘుపతి, ప్రవీణ్ కొండగ, శ్రీవివాస్ గంగ, యష్ బద్దులూరి, శ్రీ విద్యా సోమ, సురేష్ పాలడుగు, మన్నె సుశాంత్, ఫణి తాళ్లూరి, మన్నె సత్యనారాయణ, తానా 2023 కాన్ఫరెన్స్ ఛైర్మన్ రవి పొట్లూరి, తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ తెలుగు సంఘాలైన తానా, ఆటాతో సహా పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జీడబ్ల్యూటీసీఎస్ ప్రస్థానంలో ఈ దీపావళి వేడుకలు మరో మైలు రాయిగా నిలిచిపోయిందని నిర్వాహకులు తెలియజేసారు. ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో హాజరయ్యారు. సమాజసేవలో ముందున్న పలువురికి దుల్కర్ సల్మాన్ జ్ఞాపికలు అందజేశారు. చిన్నారుల నృత్యాలు, మహిళల ఫ్యాషన్ షో అందరినీ అలరించాయి.













