ఎయిర్ ఇండియాలో ఎన్ఆర్ఐలకు వాటా
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ ఈక్విటీలో ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) నూరు శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రవాసులైన భారత జాతీయులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇందుకు అడ్డంకిగా ఉన్న నిబంధనలనూ సవరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటా కొనుగోలుకు ఎన్ఆర్ఐలు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిన అవసరమూ ఉండదని తెలిపింది. ఆటోమేటిక్ పద్ధతిలో వీరు నేరుగా ఇందుకోసం బిడ్స్ దాఖలు చేయవచ్చు. హిందుజాలతో సహా పలువురు ఎన్ఆర్ఐలు భారత విమానయాన రంగంలో ప్రవేశించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు.













