అత్యవసర సేవలకు మేం సిద్ధం: గోఎయిర్
కరోనా వైరస్ విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి అత్యవసర సేవలు అందించేందుకు గోఎయిర్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి అవసరమైన సరుకులు, ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, మందుల రవాణాతోపాటు డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తులను తరలించేందుకు, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు, దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకున్న విదేశీ, స్వదేశీ నిఫుణులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు తమ విమానాలు, సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు శుక్రవారం లేఖ రాసింది. మరో ప్రైవేట్ విమాయాన సంస్థ ఇండిగో కూడా ఇటీవల కేంద్రానికి ఇలాంటి ప్రతిపాదనే చేసింది. కరోనాపై పోరులో భాగంగా పలు ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి బాసటగా ముందుకొస్తున్నాయి.













