నలుగురు భారతీయులకు కాంగ్రెసెనల్ అవార్డులు
అమెరికా కాంగ్రెస్ అందించే అత్యున్నత యువజన పురస్కారానికి భారత సంతతికి చెందిన నలుగురు ఎంపికయ్యారు. 2017 కాంగ్రెసెనల్ అవార్డ్ గోల్డ్మెడల్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో వీరికి ఈ పురస్కారాలను అందజేశారు. మొత్తం 39 రాష్ట్రాలకు చెందిన 373 మంది యువతీ, యువకులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో భారత్కు చెందిన సంజన ఎరుబండి, విదుర్ ప్రసాద్, పక్రుష్ కాటగడ్డ, అరిహంత్ చొర్దియా ఉన్నారు. స్వచ్ఛందంగా సమాజ సేవ, వ్యక్తిత్వ వికాసం, దేహదారుఢ్యం, సాహసయాత్రలు వంటి నాలుగు కేటగిరీలుగా విభజించి ఈ అవార్డులను ప్రకటించారు. యువతలోని చొరవ, సేవాభావం, సాధించిన ఘనకార్యాలను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించే దిశగా 14 నుంచి 24 ఏళ్ల వయసు గల యువతకు ఈ అవార్డులను అందిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. కేపిటల్ హిల్స్ జూన్ 21న అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సభ్యులు, అవార్డు గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.













