ప్రళయభీకరంగా…
అమెరికాను పెను తుపానులు కుదిపేస్తున్నాయి. తూర్పు అమెరికాలో పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోంది. అక్కడ భీకర గాలులు, ఉరుములతో కూడిన వర్షం, వడగళ్లు విరుచుకుపడ్డాయి. టెనసీ నుంచి న్యూయార్క్ వరకు 10 రాష్ట్రాల్లో కల్లోల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు మూడు కోట్ల మంది టోర్నడోల ముప్పు ఎదుర్కొన్నారని ‘జాతీయ వాతావరణ సేవల విభాగం’ తెలిపింది. వాషింగ్టన్ డీసీలో ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఇతర సేవలను ముందుగానే మూసేశారు.
న్యూయార్క్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, అట్లాంటా, బాల్టిమోర్లలోని విమానాశ్రయాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ ‘ఫ్లైట్అవేర్’ ప్రకారం.. వేలాది విమానాలు రద్దుకాగా.. మరికొన్ని ఆలస్యంగానడుస్తున్నాయి.మేరీల్యాండ్, అలబామా, జార్జియా, ఉత్తర, దక్షిణ కరోలినాలు, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, వర్జీనియా తదితర ప్రాంతాల్లో 11 లక్షల ఇళ్లు, దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం.
అటు.. ఐరోపాను సైతం భారీ, అతిభారీవర్షాలు వణికిస్తున్నాయి.కోపెన్‌హాగెన్, సియోల్: ఉత్తర ఐరోపాలో హాన్స్ తుపాను కారణంగా పలువురు ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని నార్వే అధికారులు హెచ్చరించారు. నార్వే, డెన్మార్క్, స్వీడన్, లిథువేనియా, ఫిన్లాండ్, ఎస్తోనియా, లాత్వియా దేశాల్లో తీవ్ర గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
మరోవైపు…కొరియా ద్వీపకల్పం దిశగా ఉష్ణమండల తుపాను ఖానున్ దూసుకొస్తున్న నేపథ్యంలో దక్షిణ కొరియా నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో 156 దేశాల నుంచి తీరప్రాంత పట్నం బువాన్కు వచ్చిన 37 వేల మంది యువ వాలంటీర్లను సియోల్‌కు తరలించింది. వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.













