అబుదాబిలో ఆలయ నిర్మాణం సంతోషకరం – లక్ష్మీకాంతం
యూఏఈ రాజధాని అబుధాబిలో అక్కడి యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయద్ విరాళంగా ఇచ్చిన 13.5 ఎకరాల స్థలంలో గుజరాత్‌కు చెందిన బాప్స్ స్వామినారాయణ్ సంస్థ స్వామినారాయణ్ ఆలయాన్ని నిర్మిస్తోంది. ఈ ఆలయ సముదాయ నిర్మాణానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి హాజరైన సుమారు 2500 మంది భక్తుల సమక్షంలో బాప్స్ సంస్థకు చెందిన ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహరాజ్.. ఆగమ శాస్త్రాల ప్రకారం శిలన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశం నుంచి ప్రత్యేకంగా వచ్చిన 50 మంది వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, భారత్ నుంచి తెచ్చిన మూడు నదుల పవిత్ర జలాలను చల్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత రాయబారి నవదీప్ సూరి, ప్రముఖ ప్రవాసీలు, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్, యూఏఈ ఎక్స్ఛేంజ్ అధినేత బీఆర్ శెట్టి, తిరుపతి నుంచి ప్రత్యేకంగా వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటిడి) సంయుక్త కార్యనిర్వాహక అధికారి (జేఈఓ) బి. లక్ష్మీకాంతం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మీకాంతం మాట్లాడుతూ, అబుదాబీలో జరిగిన ఆలయ శిలాన్యాస కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. బాప్స్ సంస్థకు చెందిన బ్రహ్మవిహారీదాస్ లక్ష్మీకాంతంను మర్యాదపూర్వకంగా కలిసి అబుధాబికి వచ్చినందుకు కతజ్ఞతలు చెప్పారు.













