ట్రంప్ టవర్ లో అగ్నిప్రమాదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టవర్లోని 50వ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా, ఆరుగురు అగ్ని మాపక సిబ్బంది గాయపడ్డారు. న్యూయార్క్ సిటీ అగ్నిమాపక విభాగం ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు అధ్యక్షుడు ట్రంప్ కుటుంబ సభ్యులెవరూ కూడా ఈ భవంతిలో లేరని అగ్నిమాపక కమిషనర్ డేనియల్ నిగ్రో వెల్లడించారు. 50వ అంతస్తులో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలిపారు. ట్రంప్ టవర్లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయనీ, అగ్నిమాపక సిబ్బంది కృషికి అభినందనలు అంటూ అధ్యక్షుడు ట్రంప్ ఈ తర్వాత ట్వీట్ చేశారు.













