డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై ధర్మాసనం మరోసారి నీళ్లు చల్లింది. ప్రతిపాదిత ముస్లిం దేశాల పౌరులు అమెరికా ప్రవేశించకుండా నిషేధాన్ని విధించే హక్కు అధ్యక్షుడికి లేదని హవాయి ఫెడరల్ జడ్జీ సృష్టం చేశారు. సెప్టెంబర్‌లో ట్రంప్ ప్రకటించిన ఆదేశాలు మరో వారంలోనే అమల్లోకి రానున్న నేపథ్యంలో నిలుపుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ట్రంప్ ప్రతిపాదనపై హవాయి రాష్ట్రం కోర్టును ఆశ్రయించింది. ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టాలను మార్చే హక్కు అధ్యక్షుడికి లేదని, ట్రంప్ ప్రతిపాదించిన నిషేధాన్ని నిలుపుదల చేయాలని వ్యాజ్యంలో పేర్కొంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం, హవాయి రాష్ట్ర వాదనతో ఏకీభవించింది. అన్నీ విషయాలను పరిశీలించిన అనంతరం ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా ముస్లిం దేశాలతోపాటు ఉత్తరకొరియా, వెనిజులా అధికారులు అమెరికా రాకుండా విధించనున్న నిషేధాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.
మార్చి నెలలో ట్రంప్ ట్రావెల్ బ్యాన్పై నిషేధం విధించిన న్యాయమూర్తి యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జీ డెరిక్ వాట్సన్ కొత్త ప్రతిపాదనపై ఈ తీర్పునిచ్చారు. ఈ నిషేధం ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టాలకు విరుద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తాజాగా విధించిన ఈ ఆదేశాలతో ప్రతిపాదించిన ముస్లిం దేశాల ప్రజలను అమెరికాలో అడుగుపెట్టనీయకూడదని ప్రయత్నించిన ట్రంప్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.













