ట్రంప్ కు పోటీగా కమలాహారీస్… భారత సంతతి హర్షం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున నిలిచిన ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పోటీ నుంచి వైదొలిగి తాను ఈ పోటీకి అభ్యర్థిగా కమలాహారీస్‌ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పదవికి నామినేట్ అయి కమలా హ్యారిస్ రికార్డ్ సృష్టించారు. అధ్యక్షపదవికి నామినీ అయిన తొలి ఆసియా సంతతి నల్లజాతీయురాలిగా నిలిచారు. ఎప్పుడైతే అధ్యక్ష అభ్యర్థిగా కమలను ప్రకటించారో.. అప్పటి నుంచి డెమొక్రాట్లు సైతం ప్రచారాన్ని ఉధృతం చేశారు. కమల ప్రచార బృందం సైతం నిధుల సేకరణలో బరిలోకి దిగింది. కమల అభ్యర్థిత్వంతో డెమొక్రాట్లకు ఫండిరగ్ పెరగడం మొదలైంది. కమలా హ్యారిస్.. ఈ పేరే ఓ సంచలనం.. అగ్రరాజ్యానికి తొలి మహిళా ఉపాధ్యక్షురాలు ఆమె. ఈ పదవిలో కొనసాగిన తొలి నల్లజాతీయురాలు కూడా కమలనే.. అంతేకాదు సామాన్య కుటుంబం నుంచి వచ్చి అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా ఎదిగిన తొలి ప్రవాస భారతీయురాలు కూడా . ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్న కమలా హ్యారిస్ మరోసారి టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారారు. ఈ ఏడాది నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తప్పుకున్నారు. ఆ వెంటనే కమలను డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో బైడెన్ వర్సెస్ ట్రంప్ పోరు కాస్త కమల వర్సెస్ ట్రంప్ ఫైట్‌గా మారింది.
భారతీయ మూలానికి చెందిన మహిళ..
కమలా హారిస్ అక్టోబర్ 20, 1964న కాలిఫోర్నియాలో జన్మించారు. కమల తల్లి పేరు శ్యామలా గోపాలన్. ఆమె భారతీయ మూలానికి చెందిన మహిళ.. ఆమె క్యాన్సర్ శాస్త్రవేత్త కూడా. శ్యామలా గోపాలన్ చెన్నైలో పుట్టి, తర్వాత 1960లో అమెరికాకు వెళ్లారు. ఇక కమల తండ్రి పేరు డొనాల్డ్ హారిస్. ఆయన జమైకన్ మూలానికి చెందినవాడు. కమలా హారిస్‌కు ఐదేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. విడాకుల తర్వాత కమల, ఆమె చెల్లెలు మాయను తల్లి శ్యామల గోపాలన్ పెంచారు.
ఇండియన్ కల్చర్ ..
కమల తల్లి తన ఇద్దరు కూతుళ్లను అప్పుడప్పుడూ ఇండియాకు, తమిళనాడులోని తన స్వగ్రామానికి తీసుకొచ్చేవారు. అందుకే ఇండియన్ కల్చర్ గురించి కమలకు బాగా తెలుసు. ఆమెకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కూడా. కమల హారిస్ బాల్యం కెనడాలో గడిచింది. పాఠశాల విద్య కూడా అక్కడే జరిగింది. ఇక కమల తల్లి శ్యామలా గోపాలన్‌కి మెక్‌గిల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం రావడంతో కొన్నాళ్లు అక్కడికి మారాల్సి వచ్చింది. పిల్లలిద్దరినీ కూడా తన వెంట తీసుకెళ్లింది. కమలా హారిస్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలయ్యారు. ఆ తర్వాత ఆమె కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని హేస్టింగ్స్ కళాశాల నుంచి న్యాయశాస్త్రం అభ్యసించారు. 2014లో కమల యూదు మూలానికి చెందిన ప్రసిద్ధ న్యాయవాది డగ్లస్ క్రెయిగ్‌ను పెళ్ళి చేసుకున్నారు.
అటార్నీ నుంచి సెనేటర్ వరకు..
అటార్నీ నుంచి సెనేటర్ వరకు ఎదిగిన కమలా హారిస్.. తన పొలిటికల్ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. 2003లో మొదటిసారి శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా ఎన్నికయ్యారు కమల. ఆ తర్వాత 2010, 2014 సంవత్సరాలలో కాలిఫోర్నియాకు అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యాను. ఇక.. ఆ తర్వాత కాలిఫోర్నియా జూనియర్ సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ఆమె సెనేట్‌లో చేరిన రెండో ఆఫ్రికన్-అమెరికన్ వ్యక్తి. అంతేకాదు మొదటి దక్షిణాసియా మహిళ కూడా. కమలా హారిస్ అమెరికాలో తుపాకీ నియంత్రణ కోసం కఠిన చట్టాలు ఉండాలని ప్రచారం చేశారు. అంతేకాదు వలసదారుల పౌరసత్వం అంశాన్ని కూడా గట్టిగా లేవనెత్తారు. 2019 నాటికి, డెమోక్రాట్ల తరపున కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి అప్లై చేసుకున్నారు. అయితే, 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లు జో బైడెన్‌ను తమ అభ్యర్థిగా చేశారు. కమలను ఉపాధ్యక్షురాలిగా నిలబెట్టారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించిన కమల బైడెన్‌కు దన్నుగా నిలబడ్డారు. 2020 అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్లు ఘన విజయం సాధించడంతో కమల ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇక ఈ ఏడాది డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. ఒకవేళ ఎన్నికల్లో డెమొక్రట్లు విజయం సాధిస్తే కమల చరిత్ర సృష్టిస్తారు. ఎందుకంటే 248ఏళ్ల స్వాతంత్ర అమెరికాలో ఇప్పటివరకు ఏ మహిళ కూడా అగ్రరాజ్యం అధ్యక్ష పదవిని చేపట్టలేదు.
ఎన్నికల్లో కమలా హారీస్ విజయం సాధిస్తుందనే నమ్మకంతో డెమోక్రాట్స్ ముందుకు సాగుతున్నారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కూడా కమలా హారీస్పై నమ్మకం ఉంచాల్సిన సమయం వచ్చిందంటూ చెప్పుకొచ్చారు.కాగా, అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్ బైడెన్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జిల్ బైడెన్..‘మమ్మల్ని విశ్వసించిన వారికి నా కృతజ్ఞతలు. మీరు ఇన్ని రోజులు జో బైడెన్‌పై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మాపై మీ అభిమానం ఎల్లప్పుడూ నా హృదయంలో నిండి ఉంటుంది. ఇప్పుడు కమలా హారీస్పై ఆ నమ్మకాన్ని ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆమెపై నాకు నమ్మకముంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇక, తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని జో బైడెన్ చెప్పుకొచ్చారు. తాజాగా జో బైడెన్ మాట్లాడుతూ.. ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామాన్ని పరిరక్షించటం కంటే పదవులు ముఖ్యం కాదు. కొత్త తరానికి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నా. అమెరికాను ఏకం చేయటంలో ఇదే ఉత్తమైన మార్గం. యువ గళం వినిపించడానికి ఇదే సరైన సమయం అని అన్నారు. అలాగే, అమెరికా ప్రజలకు అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవమని తెలిపారు.
పెలోసి, క్లింటన్ల మద్దతు
ప్రతినిధుల సభ మాజీ స్పీకర్, డెమొక్రాటిక్ పార్టీలో కీలక నాయకురాలు నాన్సీ పెలోసి కూడా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. శ్రామికవర్గ కుటుంబాల కోసం శ్రమించే, సునిశిత మేధోశక్తి గల రాజకీయ నాయకురాలిగా కమలను అభివర్ణించారు. బైడెన్‌ను వైదొలిగేలా ఒప్పించడంలో పెలోసిది కీలకపాత్ర. డజన్ల కొద్ది ప్రతినిధుల సభ సభ్యులు, సెనేటర్లు కూడా కమలకు మద్దతు తెలిపారు. గట్టి పోటీదారులైన పెన్సిల్వేనియా గవర్నర్ జోస్ షాపిరో, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ కూడా ఆమెకు మద్దతు ప్రకటించేశారు. అమెరికాలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు, హయత్ హోటల్ గ్రూపు వారసుడు, ఇల్లినాయీ గవర్నర్ జె.బి.ఫ్రిట్జ్‌కర్, రెండుసార్లు కెంటకీ గవర్నర్ అండీ బెషియర్ అభ్యర్థిత్వ రేసులో ఉంటారని భావించినా సోమవారం వారిద్దరూ కమలకే జైకొట్టారు. మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ కూడా ఇదే బాటలో నడిచారు. మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ కూడా కమలకే మద్దతు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ల మద్దతు కూడా లభించింది. కమలకు ఉదారంగా విరాళాలివ్వాలని హిల్లరీ పిలుపిచ్చారు.
ఆగస్టు 22 ప్రత్యేకత
కమలా హ్యారిస్ జీవితంలో ఆగస్టు 22కు ఒక ప్రత్యేకత ఉంది. 2014లో డగ్లస్ ఎంహాఫ్‌తో ఆమె పెళ్లి జరిగిన రోజు అది. సరిగ్గా పదేళ్ల తర్వాత అదే ఆగస్టు 22 మళ్లీ ఇప్పుడు ఆమె కోసం మరొక చిరస్మరణీయమైన సందర్భం కనిపిస్తోంది. 2024 ఆగస్టు 19 నుంచి 22 వరకు షికాగోలో జరిగే పార్టీ సమావేశంలో చివరి రోజున డెమోక్రాట్లు తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఆ అభ్యర్థి కమలా హ్యారిస్ అయుండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరో మూడు నెలలో అధ్యక్ష ఎన్నికలు ఉండగా పోటీ నుంచి విరమించుకున్న జో బైడెన్.. వెళుతూ వెళుతూ ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచి వెళ్లారు. ఆయన మాటపై కమలా హ్యారిస్‌కు మద్ధతుగా ఉన్న డెమోక్రాట్లతో పాటుగా, పార్టీలోని ఆమె వ్యతిరేకులు కూడా.. ఇప్పుడు ‘ట్రంప్‌ను ఓడిరచగల శక్తి’గా కమలా హ్యారిస్‌ను గుర్తిస్తున్నారు. కమలా హ్యారిస్‌ను ఆమె పిల్లలు ‘మామ్లా’ (మామ్ కమల) అని పిలుస్తారు. పిల్లలకు ఆమె సొంత తల్లి కాదు. విడిపోయిన డగ్లస్ ఎంహాఫ్ మొదటి భార్య పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. కమలా డగ్లస్‌ల పెళ్లయ్యే నాటికి అబ్బాయికి 19 ఏళ్లు. అమ్మాయికి 15. ఆ వయసులోని పిల్లలు ఒక బయటి మనిషి తల్లిలా వచ్చి తమను చేరదీస్తానంటే వెళ్లి ఒడిలో వాలిపోతారా? కానీ అలాగే జరిగింది. వాళ్లను చక్కగా కలుపుకుపోయారు కమల. కొత్తమ్మ అమ్మ అయింది. ఫ్రెండ్ అయింది. అమ్మ, ఫ్రెండ్ కలిసి ‘మామ్లా’ అయింది. తల్లి స్థానంలో తల్లిగా వచ్చి, పిల్లల మనసు గెలుచుకోటానికి శక్తి కావాలి.
అంతటి శక్తిమంతురాలు అయిన కమలకు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికవటం, ఆపైన అధ్యక్షురాలిగా నెగ్గటం ఎంత పని? అని అంటున్నారు. ‘‘అమెరికాను సకల జాతులకు సహజీవన యోగ్యమైన దేశంగా మార్చటమే నా ధ్యేయం’’ అని కమల అనడం ట్రంప్ వంటి కరడు గట్టిన జాతీయవాదులకు నచ్చకపోవచ్చు. అయితే ఆ ఒక్క మాటతో ఆమె ఇప్పటికే అధికశాతం అమెరికన్లు, అమెరికాలోని ఇతర వలస దేశాల ప్రజల హృదయాలలో గొప్ప స్థానం సంపాదించారు. ఆమె ఒకవేళ అభ్యర్థిగా ఖరారైతే ట్రంప్‌కు గట్టి పోటీ ఖాయమని పరిశీలకులు అంటున్నారు.













