శ్వేతసౌధంలో ఇఫ్తార్ కు స్వస్తి
రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చే సాంప్రదాయాన్ని ఈసారి వైట్‌హౌజ్ పక్కనపెట్టేసింది. గత రెండు దశాబ్దాలలో వైట్‌హౌస్ ఇలా చేయడం ఇదే తొలిసారి. కేవలం శుభాకాంక్షల ప్రకటనతో సరిపెట్టింది. 1805లో అప్పటి అధ్యక్షుడు థామస్ జెఫరసన్ రంజాన్‌కు ముందు వైట్‌హౌస్‌లో తొలిసారి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆ తర్వాత 1996లో అప్పటి ఫస్ట్ లేడీ హిల్లరీ క్లింటన్ ఈ సాంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించారు. 1999 నుంచి ప్రతి ఏటా వైట్‌హౌజ్‌లో ఇఫ్తార్ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి తర్వాత కూడా విందు కొనసాగింది. ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన ఒబామా కూడా 2009 నుంచి ప్రతి ఏటా ఇఫ్తార విందు ఇస్తూవచ్చారు. ప్రారంభంలో ఇఫ్తార్ విందు మధ్యాహ్నం 3:30 గంటలకు ఇచ్చేవారు. కాలక్రమంలో దీనిని సూర్యాస్తమయం తర్వాతకు మార్పు చేశారు. ఇస్లాంపై వ్యతిరేక భావజాలం కలిగిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఇఫ్తార్ సంప్రదాయానికి తెరదించినట్లు తెలుస్తోంది. అమెరికాలోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఈద్ జరుపుకుంటున్న సందర్భంగా వాళ్ల విలువలను గౌరవించడానికి అమెరికా కట్టుబడి ఉందని మరోసారి ప్రకటిస్తున్నాం. ఈద్ ముబారక్ అని వైట్‌హౌజ్ ప్రకటన వెలువరించిది. అటు విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ కూడా స్టేట్ డిపార్ట్మెంట్లో ఇఫ్తార్ ఇవ్వలేదు.













