ఆయన అమెరికా నేషనల్ హీరో : ట్రంప్
ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో దుండగుల కాల్పులకు బలైన భారత సంతతి పోలీసు అధికారి రొనిల్ సింగ్(33)పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయన అమెరికా నేషనల్ హీరో అని పొగిడారు. ఓ అక్రమ వలసదారుడి చేతిలో విధులు నిర్వర్తిస్తున్న యువ అధికారి ప్రాణాలు కోల్పోయిన రోజున అమెరికా గుండె పగిలినంత బాధపడిందని ట్రంప్ వెల్లడించారు. న్యూమన్ పోలీస్ విభాగానికి చెందిన రోనిల్ సింగ్ డిసెంబరు 26న ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన విధులు నిర్వర్తిస్తుండగా అక్రమ వలసదారుడు తుపాకీతో కాల్చి చంపేసి పారిపోయాడు. కాలిఫోర్నియా పోలీసులు తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. రొనిల్ మరణంపై ట్రంప్ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన అధికారి కుటుంబసభ్యులను, ఆయన తోటి ఉద్యోగులను ట్రంప్ ఇటీవల కలిసి మాట్లాడారు. వలసదారులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడం వల్లే ఇలాంటి దారుణం జరిగిందని ట్రంప్ ఆరోపించారు. ఇక్కడ ఉండడానికి కూడా హక్కు లేని ఓ వ్యక్తి అమెరికా యువ అధికారి ప్రాణాలను తీశాడని ఆవేదన వ్యక్తం చేశారు.













