షికాగోలో ప్రపంచ హిందూ కాంగ్రెస్
ప్రపంచంలోని నలుమూలల ఉన్న హిందూజాతిని ప్రబల ఆర్థికశక్తిగా మలచడమే లక్ష్యంగా చైతన్యపరచడానికి ప్రపంచ హిందూ కాంగ్రెస్ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 7 నుంచి 9 వరకు అమెరికాలోని షికాగోలో ఈ మెగా కార్యక్రమం జరగనుంది. స్వామి వివేకానంద షికాగోలో సెప్టెంబరు 11, 1893న ప్రసంగించి 125 ఏళ్లు కావొస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని రెండో కాంగ్రెస్ను నిర్వహిస్తున్నారు. నవంబరు 2014న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్కు 50 దేశాల నుంచి 1800 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
రెండో కాంగ్రెస్ను అంతకంటే విజయవంతం చేయాలని నిర్వాహకులు పట్టుదలగా ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, టిబెట్ ఆధ్మాత్మిక గురువు దలైలామా తదితరులు హాజరు కానున్నారు. ప్రపంచ హిందూ సంస్థ (డబ్ల్యూహెచ్ఎఫ్) అధినేత, ఐఐటీ పూర్వ విద్యార్థి స్వామి విజ్ఞాననంద ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి, అమెరికా కాంగ్రెస్లో కాలిడిన మొదటి హిందువుగా చరిత్ర షృష్టించిన తుల్సి గబ్బర్డ్ అధ్యక్షత వహించనున్నారు.













