అదును చూసుకుని చైనా దుశ్చర్యలు : డేవిడ్ స్టిల్వెల్
తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత్, చైనా మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తావిస్తూ చైనాపై అమెరికా విమర్శలు గుప్పించింది. ప్రపంచం అంతా కరోనాపై పోరాడుతుంటే ఇదే సమయాన్ని అదనుగా చూసుకుని చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి డేవిడ్ స్టిల్వెల్ చెప్పారు. భారత్-చైనా సరిహద్దుల్లో చైనా చర్యలను అమెరికా ప్రభుత్వ పాలక వర్గం నిశితంగా గమనిస్తోందని తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం డోక్లాంలోనూ చైనా ఇటువంటి కుట్రలే పన్నిందని చెప్పారు. పొరుగు దేశాలతో చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతుండడంపై తమ దేశం ఇప్పుడే తమ వైఖరిని ప్రకటించలేదని తెలిపారు. చైనా ఆర్మీ వివాదాస్పద ప్రాంతంలో చాలా లోపలికి ప్రవేశించిందని, భారీగా సైన్యాన్ని మోహరించిందని చెప్పారు. చైనా ఇలా ఎందుకు చేసిందన్న విషయంపై సృష్టత లేదని తెలిపారు. తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడంలో భాగంగా లేక వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతుందేమోనని చెప్పారు.













