బహు భాషా నిఘంటువుల నిర్మాత పెద్ది సాంబశివరావు కు డల్లాస్ లో ఘన సన్మానం
“పరాయి భాషల ప్రభావం వల్ల ప్రాంతీయ భాషలు దెబ్బ తింటున్నాయని, అంతరించి పోతున్నాయని అందుకు కారణం మీరు, కాదు మీరే అని ప్రజలు, ప్రభుత్వం, భాషావేత్తలు ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఒక వైపున భాషను పరిరక్షించుకోవడానికి ఎన్నో సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతీయ భాష యొక్క అవసరం ఒక వైపు ఉండగా దానిని కంప్యూటర్ వినియోగంతో సుసంపన్నం చేసుకోలేని పండితులు, యువతరం మరో వైపు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ సందర్భంలో సంస్థలు కాక కొందరు వ్యక్తులు భాష సేవకు అంకిత భావంతో పని చేస్తున్నారు”. అలాంటివారిలో గుంటూరుకి చెందిన పెద్ది సాంబశివరావు ఒకరని సభకు పరిచయం చేస్తూ ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ లో పదవీ విరమణ చేసిన తర్వాత 75 సంవత్త్సరాల వయస్సులో వీరు 50 నిఘంటువులను కూర్చి రికార్డులను నెలకొల్పారు. వీటిలో కొన్నిటిని అంతర్జాలములో ఉచితంగా దిగుమతి చేసుకోవటానికి వీలుగా ఉంచారు. మరి కొన్నిటిని ప్రముఖ సంస్థలు ప్రచురించాయి. ఆయన తన కృషిని ఇంతటితో ఆపకుండా అరచేతిలో అర్థాలమూట అన్నట్లుగా16,000 తెలుగు మాటలకు ఇంగ్లీష్, హిందీ అర్థాలు ఇచ్చే ఆండ్రాయిడ్ ఆప్ ను తయారు చేశారు. వి. ఫణి కిరణ్ సాంకేతిక సహకారంతో రూపొందిన ఈ అప్ ను గురించి డాక్టర్. ప్రసాద్ తోటకూర వివరించారు.
అప్ ను ఆవిష్కరించిన డాక్టర్. రాఘవేంద్ర ప్రసాద్ శ్రీ సాంబశివరావు గారి కృషిని ఆయన వ్యక్తిత్వ విశిష్ట తను ప్రశంసించారు. దేశ సమైక్యతకు భాషల పదకోశాలు అవసరమన్నారు.
7 సంవత్త్సరాల తన నిఘంటు నిర్మాణ కృషిని మరియు తాను చేసిన అన్నమాచార్య సాహిత్యం గురించి సాంబశివరావు వివరించి శ్రోతల సందేహాలకు సమాధానాలు చెప్పారు. ‘ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం’ ఉత్తరాధ్యక్షుడు చిన సత్యం వీర్నపు “తెలుగు – సంస్కృతం” నిఘంటువును ఆవిష్కరించగా,డాక్టర్. భానుమతి ఇవటూరి “సంస్కృతం – తెలుగు” నిఘంటువును ఆవిష్కరించారు. సభ చివరిలో అప్ నిర్మాత శ్రీ పెద్ది సాంబశివరావుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో పలు తెలుగు భాషాభిమానులు ఉస్చాహంగా పాల్గొన్నారు. చెన్నుపాటి కృష్ణ మోహన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.













