ట్రంప్ సర్కారు బ్లాక్మెయిల్: క్యూబా ఖండన
అమెరికాలోని ట్రంప్ సర్కారు తమ దేశాన్ని బ్లాక్ మెయిల్ చేయటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ సృష్టం చేశారు. క్యూబాపై అనుసరిస్తున్న నిర్బంద విధానాన్ని మరింత కఠినతరం చేస్తామంటూ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ చేసిన ప్రకటనను ఆయన ట్విట్టర్లో ఖండించారు. ఇందుకు సంబంధించి అమెరికా విదేశాంగశాఖ మాజీ సహాయ మంత్రి లెస్టర్ మల్లోరీ రూపొందించిన ముసాయిదా మెమోరాండంను ఆయన ప్రస్తావిస్తూ ఇందులో కిరాతకం, నియంతృత్వం, నిరంకుశత్వం శృతి మించాయని ఈ బ్లాక్ మెయిలింగ్ను తాము ఖండిస్తున్నామని మరో ట్వీట్లో పేర్కొన్నారు. క్యూబా వ్యతిరేక అధికారులు, రాజకీయ నేతలు కలిసి పన్నుతున్న ఈ కుట్రలు విజయవంతం కాబోవని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని క్యూబా విదేశాంగ మంత్రి తన ట్విట్లలో గుర్తు చేశారు.













