కరోనా ప్రభావాన్ని ఆపిన సింగపూర్
కరోనాని ఆపిన మరొక దేశం సింగపూర్. ఆసియాలోని ఇతర దేశాలతో ముఖ్యంగా చైనా హాంకాంగ్ తో చాలా బలమైన వాణిజ్య సంబంధాలున్న ఈ దేశానికి కూడా కరోనా ముప్పు ఎక్కువే. అయితే ఇది కూడా సార్స్ నుండి నేర్చుకున్న గుణపాఠంతో చాలా వేగంగా తగిన నివారణ చర్యలు చేపట్టింది. చైనా నుండి తమ దేశంలోకి వచ్చేవారిని రానీయకుండా ఆంక్షలు విధించింది. స్కూళ్లు కాలేజీలు మూసేసింది. ఎవరికి వారు స్వీయ క్వారంటైన్ నిబంధనలు పాటించేలా చేసింది. అధిగమిస్తే చాలా పెద్ద మొత్తంలో జరిమానాలు వేసింది.
దక్షిణ కొరియాలో సైతం కరోనాని ఆపేందుకు తగిన స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. జనం తిరిగే బస్స్టాపుల్లాంటిచోట్ల చేతులను శుభ్రం చేసుకునే శానిటైజర్లను ఉంచుతున్నారు. ఇక్కడ రకరకాల యాప్లను, వెబ్ సైట్లను సైతం డెవలప్ చేశారు. ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఎన్ని కిలోమీటర్లదూరంలో ఉన్నారో తెలియజేస్తున్నాయి. కనీసం పదికిలోమీటర్ల పరిధిలో ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతంలోకి వెళ్లకుండా సూచనలు ఇస్తున్నాయి. తైవాన్, సింగపూర్ల్లో ప్రభుత్వాలు చాలా వేగంగా పనిచేశాయని, వారి ఆరోగ్య మంత్రిత్వ శాఖలు, శాస్త్రవేత్తలు, వైద్యులు చాలా బాగా పనిచేశారని పరిశీలకులు భావిస్తున్నారు.













