డొనాల్డ్ ట్రంప్ కు చైనా షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా గట్టి షాకిచ్చింది. అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై అమెరికా విధించిన డ్యూటీలను కౌంటర్‌గా, అమెరికా ఉత్పత్తులపై చైనా అదనపు టారిఫ్‌లు విధించింది. 128 అమెరికా ఉత్పత్తులపై అదనంగా 25 శాతం వరకు టారిఫ్ విధిస్తున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిలో పంది మాంసం, వైన్, కొన్ని పండ్లు, నట్స్ ఉన్నాయి. టారిఫ్‌లు విధించిన 3 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తుల జాబితాను విడుదల చేస్తున్నట్టు చైనా ప్రకటించింది. 120 అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు తగ్గించే బాధ్యతలను పక్కనపెట్టిన చైనా, ఒకేసారి వాటిపై మరో 15 శాతం టారిఫ్ అదనంగా విధిస్తున్నట్టు పేర్కొంది. పంది మాంసం వంటి మరో ఎనిమిది ఉత్పత్తులపై అదనంగా 25 శాతం వరకు టారిఫ్‌లను విధిస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు కూడా తెలిపింది.













