Atlanta: అట్లాంటాలో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) 75వ జన్మదిన వేడుకలను అట్లాంటా (Atlanta) మహానగరంలో ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 20 ఆదివారం రోజున కమ్మింగ్ లోని సానీ మౌంటైన్ ఫార్మ్స్ ఎన్టీఆర్ విగ్రహ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గుడివాడ శాసనసభ్యులు రాము వెనిగండ్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలలో సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముందుగా గుడివాడ ఎమ్మెల్యే రాము వెనిగండ్ల మరియు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వెంకీ గద్దె తెలుగుదేశం పార్టీ అధినేత, రాజనీతిజ్ఞుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడి డైమండ్ జూబ్లీ పుట్టినరోజు వేడుకలకు విచ్ఛేసిన అందరికీ స్వాగతం పలికి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రవి పోణంగి, మల్లిక్ మేదరమెట్ల, కోటేశ్వరరావు కందిమళ్ల, రామక్రిష్ణ, మధుకర్ యార్లగడ్డ తదితరులు మాట్లాడారు. దేశానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు చేసిన సేవల్ని అందరూ కొనియాడారు. ముఖ్య అతిథి, గుడివాడ శాసనసభ్యులు రాము వెనిగండ్ల మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రగతికోసం నిత్యం తపించే నాయకుడు చంద్రబాబు అన్నారు. ప్రపంచం అంతా ఈరోజు, రేపటి గురించి ఆలోచిస్తే చంద్రబాబు మాత్రం రేపటి తరం గురించి ఆలోచిస్తారని అన్నారు. తరువాత వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.








