కరోనా…కాలిఫోర్నియా అధికారిక లెక్కలు విడుదల
కాలిఫోర్నియా రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వాళ్ళ వివరాలను జాతిపరంగా కాలిఫోర్నియా అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ప్రతిరోజు కరోనావైరస్పై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తున్నప్పటికీ అందులో జాతి పరంగా కేసుల వివరాలు ఉండటం లేదు. దీంతో ఖచ్చితమైన లెక్కలకోసం ప్రభుత్వ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడినవారి వివరాలను, మృతుల వివరాలను జాతిపరంగా విడదీసి ప్రకటించారు.
ఆ లెక్కల ప్రకారం కరోనా బారిన పడినవారిలో తెల్లజాతీయుల సంఖ్య 37శాతం ఉందని, లాటినో జాతీయులు 30శాతం, ఏసియన్ జాతీయులు 14శాతం, నల్లజాతీయులు 6శాతం, సంకరజాతీయులు 2.5శాతం, హవాయి లేదా ఫసిఫిక్ ఐలాండ్ వాసులు 1.6శాతం, అమెరికన్ ఇండియన్ లేదా అలాస్కా వారు 0.2శాతం, ఇతరులు 9శాతం ఉన్నారని ప్రభుత్వ యంత్రాంగం వివరించింది. కరోనా బారిన పడి మరణించిన వారి వివరాలను కూడా అధికారయంత్రాంగం ప్రకటించింది. అందులో తెల్లజాతీయులు 43శాతం, లాటినో 29శాతం, ఏసియన్ 16శాతం, నల్లజాతీయులు 3శాతం, సంకరజాతీయులు 2శాతం, హవాయి లేదా ఫసిఫిక్ ఐలాండ్ వాసులు 1శాతం, అమెరికన్ ఇండియన్ లేదా అలాస్కా నేటివ్ 0.6శాతం, ఇతరులు 5శాతం ఉన్నారని తెలిపింది. రాష్ట్ర జనాభా దామాషా ప్రకారం ఈ లెక్కలను ప్రకటించారని గవర్నర్ చెప్పారు.
ఏ రాష్ట్రం కూడా ఫలానా జాతీయునికి ఇంత సంఖ్యలో సోకిందని ఖచ్చితమైన లెక్కలను చెప్పే పరిస్థితిలో ప్రస్తుతం లేదని అంటూ సాధ్యమైనంతవరకు ఈ లెక్కలను అధికారయంత్రాంగం ప్రకటించిందని చెప్పారు. కాగా అమెరికా సెన్సస్ బ్యూరో ప్రకారం కాలిఫోర్నియా రాష్ట్ర జనాభా లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. లాటినో లేదా హిస్పానిక్ జాతీయులు 39.3శాతం, తెల్లవాళ్ళు 36.8శాతం, ఏసియన్ 15.3శాతం, నల్లజాతీయులు 6.5శాతం, అమెరికన్ ఇండియన్ 1.6శాతం, పసిఫిక్ ఐలాండర్ 0.5శాతం ఉన్నారు. కరోనా వైరస్ వల్ల ఓ జాతీయులే ఎక్కువమంది చనిపోయారన్న దానికన్నా ఈ వైరస్ వల్ల నష్టపోకుండా ఎదుర్కోవడంపైనే దృష్టి పెట్టడం మంచిదని గవర్నర్ గవిన్ న్యూసోమ్ హితవు పలికారు.













