ఫిలడెల్ఫియాలో ‘భారతీయం’ సత్యవాణి మీట్ అండ్ గ్రీట్ విజయవంతం
                                    ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29వ తేదీన భారతీయం సత్యవాణిగారితో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది. నారీస్ టౌన్‌లోని హౌస్ ఆఫ్ బిర్యానీ అండ్ కెబాబ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యవాణి గారు మాట్లాడుతూ, భారతీయం ఎంత గొప్పదో, దాని విశిష్టతను తెలియజేస్తూ నేటితరం పిల్లలకు తల్లితండ్రులతోపాటు, తానా లాంటి సంస్థలు చొరవ తీసుకుంటే భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కనుమరుగు కావని చెప్పారు. భారతీయ హిందూ సంప్రదాయాల వెనుక ఉన్న కారణాలు చాలామందికి తెలియవని, అవి తెలుసుకుని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పాటించవచ్చని చెప్పారు. భారతీయ సంప్రదాయాల పరిరక్షణ మన జీవనవిధానానికి ముఖ్యమని చెబుతూ, వాటి పరిరక్షణకు, వాటి ప్రచారానికి అందరూ కృషి చేయాలన్నారు. ఆధునిక ప్రపంచంలో యువత తమ సంప్రదాయాలను వదిలిపెట్టకుండా వాటిపై గౌరవం ఉంచాలని ఆమె కోరారు. ఆధ్మాత్మికత, నైతికత భారతీయ జీవనశైలిలో ముఖ్యమని అంటూ, పెద్దల పట్ల గౌరవం, కుటుంబ విలువలను పాటిస్తూ సమాజ శ్రేయస్సుకు అందరూ నడుంబిగించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆమె సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో ఎన్నారైలు చూపిస్తున్న చొరవను ప్రశంసించారు. తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ సమన్వయకర్త వెంకట్ సింగు, ఇతర తానా మిడ్ అట్లాంటిక్ సభ్యులు ఈ సందర్భంగా సత్యవాణిగారికి సన్మానపత్రికతోపాటు, మెమోంటోను బహకరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినవారందరికీ తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలను తెలియజేసింది.







