పదివసంతాల పండుగకు ఆప్త రెడీ
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ పది వసంతాల పండుగను వైభవంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు బాల్టిమోర్‌లోని జోసెఫ్ మేయ్యాఫ్ సింఫనీ హాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ప్రముఖ నటుడు ఎస్వీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ వేణుగాన విద్వాంసుడు నాగరాజు తాళ్ళూరి స్వరహేల వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నవలా రచయిత్రి మన్నెంశారద, సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, రంగస్థల నటుడు రవికుమార్ నరాలశెట్టి, డి.వి. సుబ్బారావుతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఆర్టీఐ కమీషనర్ పి. విజయబాబు, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, ఎపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తదితరులు హాజరవుతున్నారు. విశిష్ట ఆత్మీయ అతిధులుగా ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి డా. ఆలేఖ్య పుంజల, శాస్త్రీయ నృత్యకళాకారిణి శ్రీమతి డా.శృతకీర్తి, సినీ గాయకులు జి. ఆనంద్, నవలా రచయిత ఎర్రంశెట్టి శాయి వస్తున్నారు. తెలంగాణ రత్న, ఆంధ్రనాట్యం, పేరిణి నాట్యాచార్యులు కళాకృష్ణ, కూచిపూడి కళాకారిణి అంబిక జవ్వాది తదితరులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.













