ఘనంగా ముగిసిన ‘ఆప్త’ వేడుకలు
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) 15వ వార్షికోత్సవ వేడుకలు అట్లాంటాలోని గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. మూడు రోజుల పాటు విందు వినోదాలతో, ఆట పాటలతో, రాజకీయ, వ్యాపార, సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నులపండుగగా జరిగిన ఆప్త 15వసంతాల సంబరాలు ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు రఘు కుంచె, మణిశర్మ, కోటి సంగీత విభావరులు జరిగాయి.
ఈ వేడుకల్లో చివరి రోజు కార్యక్రమాలు వద్దిపర్తి పద్మాకర్ అష్టావధానంతో మొదలయ్యాయి. 8 మంది పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఛలోక్తులు విసురుతూ ఇచ్చిన సమాధానాలు ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలు అందుకున్నాయి. జనసేన నేతలు సత్య బొలిశెట్టి, డాక్టర్ హరి ప్రసాద్, బండ్రెడ్డి రామ్‌లతో నిర్వహించిన పొలిటికల్ ఫోరమ్, తెలంగాణ భాజపా నేత బండి సంజయ్‌తో మీట్ అండ్ గ్రీట్, కళ్యాణ్ దిలీప్ సుంకర సామాజిక, రాజకీయ విశ్లేషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తన సంగీత విభావరితో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు దాతలను, కన్వెన్షన్ కమిటీలలో కృషి చేసిన వారిని, ఆప్త ఎగ్జిక్యూటివ్ టీమ్‌లను సత్కరించారు. ఈ కార్యక్రమాలకు రాజకీయ, సినీ రంగాలనుంచి విచ్చేసిన ప్రత్యేక అతిథులు బొత్స సత్యనారాయణ, బండి సంజయ్, హరి ప్రసాద్ పసుపులేటి, రామ్ బండ్రెడ్డి, కళ్యాణ్ దిలీప్ సుంకర, కదిరి బాబురావు, మున్నా ధూళిపూడి, అంగన రాయ్, సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, సంపత్ నంది, మెహరీన్, లయ, అనంత్ శ్రీరామ్, ఆస్కార్ విజేత చంద్రబోస్, సత్య బొలిశెట్టి, తదితరులకు ఆప్త అధ్యక్షులు ఉదయ్ భాస్కర్ కొట్టె, కన్వీనర్ విజయ్ గుడిసేవ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తొలిసారిగా ఆప్తలో ప్రవేశపెట్టిన ఆప్త పురస్కారాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రెసిడెంట్స్ క్లబ్ (2008 నుంచి 2023 వరకు పని చేసిన ప్రెసిడెంట్స్) ఎంపిక చేసిన ప్రతిభావంతులైన వారికి ఈ పురస్కారాలను అందజేశారు. ఆప్త జీవిత సాఫల్య పురస్కారం – సుబు కోట, ఆప్త పరమ విశిష్ట విశ్వ సేవా పురస్కారం – సంకురాత్రి చంద్ర శేఖర్, ఆప్త విశిష్ట విశ్వ సేవా పురస్కారం- రంగిశెట్టి మంగబాబు, శ్రీహరి కోటెల, ఆప్త సేవా పురస్కారం 2019-20కి శ్రీధర్ శంకరరావు, 2021-22 ఏడాదికి గాను అనిల్ వీరిశెట్టికి, 2023కు గాను రవి ఎలిశెట్టికి ప్రదానం చేశారు. ఆప్త నాయకత్వ పురస్కారాన్ని ప్రసాద్ సమ్మెటకు అందజేసి గౌరవించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ, సినీ, వాణిజ్యరంగంలోని ప్రముఖులు విచ్చేశారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6గంటలకు కర్టెన్ రైజర్‌తో ప్రారంభమైన ఈ వేడుకల్లో తొలుత ప్రధాన దాతలు సుబ్బు కోట, విజయ్ ఉడిసెవా, ఉదయ్ భాస్కర్ కొట్టె, శ్రీని బైరెడ్డి, రావు రెమ్మల, రాజేష్ కళ్లేపల్లి, సూర్య, సత్య తోట, తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తొలిరోజు ప్రముఖ సినీ నటులు సమంత, సాయి ధరమ్‌తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా రఘు కుంచెతో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ వేడుకల్లో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, తెలంగాణ భాజపా నేత, ఎంపీ బండి సంజయ్, జనసేన నేత హరిప్రసాద్ పసుపులేటి, రామ్ బండ్రెడ్డి, కల్యాణ్ దిలీప్ సుంకర, సంగీత దర్శకులు కోటి, రఘు కుంచె, సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ను ఘనంగా సన్మానించారు. ‘ఆప్త’ 15 ఏళ్ల వార్షికోత్సవాల్లో భాగంగా మరుసటి రోజు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆప్త అధ్యక్షుడు ఉదయ్ భాస్కర్ కొట్టె జ్యోతి ప్రజ్వలన చేసి పలు కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సావనీర్‌ను విడుదల చేశారు. క్రీడలు, ఫ్యాషన్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం జరిపించారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెండో రోజు వేడుకల్లో బండి సంజయ్, హరిప్రసాద్, సత్య బొలిశెట్టి, కదిరి బాబూరావు, మున్నా ధూళిపూడి, అంగన రాయ్‌తో పాటు సాయి ధరమ్‌తేజ్, సందీప్ కిషన్, సంపత్ నంది, మెహరీన్, లయ తదితరులు పాల్గొని సందడి చేశారు. మొత్తంగా ‘ఆప్త’ 15 ఏళ్ల సంబరాలు విందు, వినోదాలతో ఆట పాటలతో కన్నుల పండువగా జరిగాయి.













